వ్యాసుడు చేసిన శ్రీదేవి స్తుతి
శుభదర్శనుడగు వ్యాసునితో కుంతి యిట్లు విన్నవించెను. 'తపోధనా! ద్వైపాయనా! నా కొడుకు కర్ణుడు తాను పుట్టినప్పుడే నానుండి దూరమయ్యెను. నా మది యిపు డతనిని గాంచ పరితపించుచున్నది. కనుక నాకతనిని జూపుము. ఓ విభూ! మహానుభావా! ఇందులకు నీవే సమర్థుడవు. కనుక నా వాంఛితము నెఱవేర్పుము.' గాంధారి యిట్లనియెను: 'దుర్యోధనుడు రణమున కేగిన పిమ్మట నేనతనిని చూచి యెరుగను. కనుక నోమునివర్యా ! అతనిని నతని సోదరులను నాకిపుడు జూపుము.' సుభద్ర యిట్లు పలికెను: 'ఓ మహాతపోధనా! అభిమన్యుడు నాకు ప్రాణములకంటె ప్రియమైనవాడు. నే నతనిని జూడగోరుచున్నాను. కనుక నా కతనిని జూపుము.' సూతుడిట్లనియెను: ఆ విధముగ వ్యాసుడు వారు పల్కిన పల్కు లాలకించెను. ఆ మునీశ్వరుడు సంధ్యాసమయమున గంగనుజేరి ప్రాణాయామ మాచరించెను. అపు డతడా దేవదేవి దీనబంధువగు శ్రీసనాతనీ దేవిని హృదయకమలమందు నిలిపి ధ్యానించెను. పిదప వ్యాసుడు యుధిష్ఠరాదుల రావించెను. వారా పుణ్యగంగాజలముల పరిశుద్ధులైరి. ఆ విశ్వజననిని సంతుష్టురాలిని చేసి వ్యాసుడిట్లు సన్నుతించెను:
ప్రకృతిం పురుషారామాం సుగుణాం నిర్గుణాం తథా | దేవదేవీం బ్రహ్మరూపాం మణిద్వీపాధివాసినీమ్. 60
యదా న వేధా న చ విష్ణు రీశ్వరో న వాసవో నైవ జలాధిప స్తథా |
న విత్తపో నైవ యమశ్చ పావకస్తదాసి దేవి త్వం మహం నమామి తామ్. 61
జలం న వాయు ర్న ధరా నచాంబరమ్ గుణా న తేషాం చ న చేంద్రియా ణ్యహమ్ |
మనో న బుద్ధి ర్న చతిగ్ముగుః శశీ తదాసి దేవి త్వ మహం నమామి తామ్. 62
ఇమం జీవలోకం సమాధాయ చిత్తే గుణౖ ర్లింగకోశం చ నీత్వా సమాధౌ |
స్థితా కల్పకాం నీయ స్వాత్మతంత్రా న కోప్యస్తి వేత్తా వివేకం గతోపి. 63
ప్రార్థయత్యేష మాం లోకో మృతానాందర్శనంపునః | నాహం క్షమో%స్మిమాతస్త్వం దర్శయాశుజనాన్మృతాన్. 64
సూతః. ఏవం స్తుతా తదా దేవీమాయా శ్రీభువనేశ్వరీ | స్వర్గా దాహుయ సర్వాన్వై దర్శయామాస పార్థివాన్. 65
దృష్ట్వా కుంతీ చ గాంధారీ సుభద్రా చ విరాటజా | పాండవా ముముహుః సర్వే వీక్ష్య ప్రత్యాగతా న్స్వకాన్. 66
పున ర్విసర్జితా స్తేన వ్యాసేనామితతేజసా | స్మృత్వా దేవీం మహామాయా మింద్రజాల మివోద్యతామ్. 67
తదా పృష్ట్వా యయుః సర్వే పాండవా మునయన్తథా | రాజా నాగపురం ప్రాప్తః కుర్వ న్వ్యాసకథాం పథి. 68
.
''శ్రీదివ్యమూల ప్రకృతీ! పురుషారామా! సగుణనిర్గుణాకృతీ! దేవదేవీ! బ్రహ్మ రూపిణీ! సుందరమణిద్వీపనివాసినీ! బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ఇంద్రాగ్ని యమవరుణ కుబేరులకు పూర్వమే వెలుగొందు శ్రీమాతృదేవీ! ఓ ఆద్యయగు పరాశక్తీ! నీకు సుమాంజలు లర్పింతును తల్లీ! ఓ పరిపూర్ణా! కళామయీ! భవానీ! ఈ పంచమహాభూతములు వాని గుణములు మనోబుద్ధ్యహంకారములు కరణములు సూర్యచంద్రులులేని మహాకాలమున తెలియరాని పెంజీకట్ల కావల నేకైక మహాజ్యోతిర్మూర్తివై విలసిల్లు దేవీ! నీకు సుమాంజలు లర్పింతును. విరాట్ స్వరూపమగు జీవలోకమును హిరణ్యగర్భమయమగు చిత్తమందునిలిపి యాసమష్టిలింగశరీరమగు హిరణ్యగర్భతత్త్వమును సామ్యావస్థలో నుంచి కల్పము చివరిదాక నిశ్చలచైతన్యజ్యోతియై వెలుగొందు శ్రీదేవి నెంత వివేకియు నెఱుగజాలడు. నీ వే యా మృతవీరుల జూపింపుము.'' ఈ వ్యాసస్తోత్రముతో నన్నుతయై శ్రీ భువనేశ్వరీ దేవి స్వర్గమునుండి మృతవీరుల రావించి యక్కడివారికి జూపెను. అట్లు మరల గనంబడిన తమ తమ వారిని కుంతి గాంధారి సుభద్ర ఉత్తర పాండవులు చూచి చూచి ముగ్ధులై శ్రద్ధాంజలు లర్పించిరి. పిదప వ్యాసుని యమితతేజము చేత వచ్చినవారలు మరల తమ తమ చోటులకు పంపబడిరి. ఇట్లు పాండవులు శ్రీదేవి దయవలన నింద్రజాలమువంటి దృశ్యము గాంచిరి. తరువాత నెల్లరు తమ తమ వాసములకు చేరుకొనిరి. పాండవ లట్లు శ్రీవ్యాసుని కథామృతపు చిలువలు రుచి జూచుచు హస్తిపుర మరిగిరి.
ఇది శ్రీదేవీ భాగవతమందలి ద్వితీయ స్కంధమందలి సప్తమాధ్యాయము.
No comments:
Post a Comment