Tuesday, April 14, 2020

శ్రీదేవి దివ్యస్వరూపము

శ్రీదేవి దివ్యస్వరూపము




విష్ణుని వచనములు విని యెల్ల దేవతలును సహర్షముగ శ్రీదేవికి తమ తమ దివ్యభూషణములు వస్త్రములు దివ్యాయుధములు సమర్పించిరి. శ్రీదేవికి క్షీరసాగరము ప్రీతితో నక్షయములు దివ్యములు సూక్ష్మములు నగు రెండెఱ్ఱని వస్త్రములు నొక మిగుల నలంకృతమగు మణిహారము నొసంగెను. విశ్వకరమ ప్రసన్నములగు ఇంద్రియములును మనస్సున కలవాడై సూర్యకోటి సమప్రభలతో వెలుగు దివ్య చాడామణిని చెవులకు శుభకుండలములను భుజములకు దివ్యకటకములను నానా రత్న విరాజితములై దివ్యములైన కేయూర కంకణములను దేవి కొసంగెను. దేవి పదపద్మములకు త్వష్ట సూర్యకాంతి సదృశకాంతులు విరజిమ్ముచు నిర్మల మంజుల రత్నభూషితములైన గజ్జెలందియ లొసంగెను. మహాసాగరుడు దేవదేవికి సర్వతేజోవంతములగు ముద్దుటుంగరములు సుందర కంఠహారములు నొసంగెను. వరుణదేవుడు శ్రీదేవికి వాడని కమలముల మాలను వైజయంతిని కానుకగ నొసంగెను. కమ్మని నెత్తావులు గుబాళించుటవలన కమలముల చుట్టు గుండుతుమ్మెదలు ఝంకారములు చేయుచుండెను. హిమవంతుడు సంతుష్టుడై బంగారమువంటి కాంతితో మనోహరమగు సింహవాహనమును వివిధ రత్నరాసులను దేవి కర్పించెను. ఈ విధముగ శ్రీదేవి సకల లక్షములతో భూషణములతో శ్రేష్ఠురాలై శుభరూపయై వరారోహయై మృగరాజుపై విరాజిల్లుచుండెను. అంత చక్రి తన చక్రమందుండి యొక దివ్య సుదర్శన చక్రమును సముత్పన్న మొనరించి శ్రీదేవి కొసంగెను. ఆ చక్రము రక్కసిమూకలు తలలు ప్రక్కలించుటకు సమర్థమై యుండెను. శూలి తన శూలమునుండి యొక యుత్తమ త్రిశూల ముత్పన్న మొనరించి మహాలక్ష్మి కొసంగెను. ఆ శూలము సురవైరులను నరుకజాలి సురల భయ ముడుపజాలి వెలుగొందుచుండెను. వరుణుడు తన శంఖమందుండి అతి శుభకరమగు నొక శంఖము సృజించి దేవికి ప్రసన్నమతితో నొసంగెను. అది మహాఘోష గంభీరమై దివ్యమై తనరారుచున్నది. అగ్నిదేవుడు దైత్య వినాశకరమైన తీవ్రవేగముగల శతఘ్నియగు శక్తిని శ్రీదేవికి ప్రదానము చేసెను.


వాయుదేవుడు గొప్ప చాపమును కఱకుటమ్ములతో నిండిన యమ్ముల పొదియుగు శ్రీదేవి కొసంగెను. ఆ ధనువు లాగుటకు శక్యముగాక చూపఱ కచ్చెరువు గొల్పుచు భీకర టంకారమున నొప్పుచుండెను. ఇంద్రుడు తన వజ్రము నుండి సిద్ధపఱచిన యొక దారుణ వజ్రమును ఐరావతము నుండి శోభన శబ్దము కలదియు అతి సుందరమును నగు నొక ఘంటను శీఘ్రమే సమర్పించెను. కాలము తీరిన యెల్ల ప్రాణులకు దేనివలన చావుమూడునో యట్టి కాలదండము నుండి యముడొక దండమును సృజించి దేవి కర్పించెను. బ్రహ్మ గంగాజల పూరితమైన దివ్య కమండలువును వరుణుడు దివ్యపాశమును సంతసమున దేవదేవి కొసంగిరి. కాలుడు ఖడ్గ చర్మములను విశ్వకర్మ వాడి గండ్ర గొడ్డలిని శ్రీదేవికి సమర్పించిరి. వరుణ కుబేరులు దేవికి వరుసగ మనోహరమైన కమలమును సురతో నిండిన బంగరు మధుపాత్రను నందించిరి. త్వష్ట దానవ నాశనికి ప్రసన్న చిత్తముతో సురశత్రు వినాశనియు నూఱు గంటలతోకూడి ధ్వనించుచున్నదియు నగు కౌమోదకీ గదను సమర్పించెను. త్వష్ట దేవికి వైరులను నుగ్గొనర్చు పెక్కు విధములగు దివ్యాస్త్రములను భేదింపరాని కవచము నర్పించెను. సూర్యుడా జగదంబకు తన దివ్యతేజము నొసంగెను. ఆమె భూషణములతో నాయుధములతో విలసిల్లు త్రైలోక్యమోహినిగ శివస్వరూపిణిగ ప్రకాశించు చుండెను. 


శ్రీమద్దేవీ భాగవతమందలి పంచమస్కంధమందు శ్రీదేవి దివ్యస్వరూపమును మహిషుడు మోహితుడగుటయను నవమాధ్యాయము. నుండి.

No comments:

Post a Comment