Friday, April 10, 2020

బ్రహ్మ చేసిన మహామాయ స్తుతి

బ్రహ్మ చేసిన మహామాయ స్తుతి


నవేదా స్త్వామేవం కలయితు మిహాన న్నపటవో యతస్తే నోచుస్త్వాం సకలజనధాత్రీ మవికలామ్‌ |
స్వాహాభూతా దేవీ సకలమఖహోమేషు విహితా తదా త్వం సర్వజ్ఞా జనని ఖలు జాతా త్రిభువనే. 26
కర్తాహం ప్రకరోమి సర్వమఖిలం బ్రహ్మాండ మత్యద్భుతమ్‌
కోన్యోస్తీహ చరాచరే త్రిభువనే మత్తః సమర్థః పుమాన్‌ |
ధన్యోస్మ్యత్ర న సంశయఃకిల యదా బ్రహ్మాస్మి లోకాతిగో
మగ్నోహం భవసాగరే ప్రవితతే గర్వాభివేశాదితి. 27
అద్యాహం తవపాదపంకజ పరాగాదానగర్వేణ వై | ధన్యోస్మీతి యథార్థవాదనిపుణో జాతః ప్రసాదాచ్చతే.
యాచేత్వాంభవభీతినాశచతురాంముక్తిప్రదాంచేశ్వరీమ్‌|హిత్వామోహకృతం మహాతినిగడంత్వద్భక్తి యుక్తంకురు. 28
అతోహంచ జాతో విముక్తః కథంస్యాం సరోజా దమేయా త్త్వదావిష్కృతాద్వై |
తవాజ్ఞాకరః కింకరోస్మీతి నూనం శివే! పాహి మాం మోహమగ్నం భవాబ్ధౌ. 29
నజానంతి యేమానవా స్తేవదంతి ప్రభుం మాం తవాద్యం చరిత్రం పవిత్రమ్‌ |
యజంతీహ యేయాజకాః స్వర్గకామా నతే తే ప్రభావం విదంత్యేవ కామమ్‌. 30


 ఓ జనయిత్రి! లోకధాత్రి! వేదములుగూడ నిన్ను గుఱించి సమగ్రముగ నభివర్ణింపనోపవు. ఓ యజ్ఞరూపిణి! నీవు యాగము లందు వేల్చునపుడు స్వాహానామమున పిలువబడుదువు. ఈ త్రిభువనములందు నీ వొక్కతెవే సర్వజ్ఞురాలవు! ఈ వింతలు గొల్పు ముల్లోకములకు నేను కర్తను. ఈ చరాచర జగములందు నాకంటె నితరుడెవ్వడును సమర్థుడు లేడు. నేనే కడు ధన్యుడను. సర్వశ్రేష్ఠుడనని గర్వాతిరేకమున దలచుచు నీ సంసార జలధిలో మునుకలు వేయుచున్నాను. ఓ ముక్తిప్రదాయినీ! భయనివారిణీ! ఈశ్వరీ! నేడు నీ సుప్రసాదమున నీ పదపద్మ సన్నిధి జేరిన నే నెంతయో ధన్యుడనని గర్వపడుచున్నాను. నాలోని మోహము గడియదీసి వెలుగుబాట జూపించుము అని నిను సవినయముగ వేడుకొనుచున్నాను. కావున నోమాతా! నీ చరణకమల ప్రభావమున నా మదినిండ శాంతికాంతులు నిండినవి. ఓ శివంకరి! ఇంక నీ యాన జవదాటను. నీ కింకరుడను. మోహ జలధిలో మునిగిన నన్ను గాపాడుము! నీ మహనీయ పవిత్ర చరిత్ర నెఱుంగని మూర్ఖులు నన్ను ప్రభువని తలంతురు. యాజకులు స్వర్గముగోరి యాగములు చేతురు.
త్వయా నిర్మితోహం విధిత్వే విహారం వికర్తుం చతుర్థా విధాయాదిసర్గమ్‌ |
అహంవేద్మి కోన్యో వివేదాదిమాయే క్షమస్వాపరాధం త్వహంకారజం మే. 31
శ్రమంయేష్టధా యోగమార్గే ప్రవృత్తాః ప్రకుర్వంతి మూఢాః సమాధౌ స్థితావై |
నజానంతి తే నామమోక్షప్రదంవా సముచ్చారితం జాతు మాతర్మిషేణ. 32
విచారేపరే తత్త్వసాంఖ్యా విధానే పదే మోహితా నామతే సంవిహాయ |
నకింతే విమూఢా భవాబ్ధౌ భవాని త్వమేనాసి సంసారముక్తి ప్రదావై. 33
పరం తత్త్వవిజ్ఞాన మాద్యైర్జ నైర్యై రజేచానుభూతం త్యజంత్యేవ తేకిమ్‌ |
నిమేషార్ధమాత్రం పవిత్రం చరిత్రమ్‌ శివాచాంబికా శక్తిరీశేతి నామ. 34
నకింత్వం సమర్థాసి విశ్వం విధాతుం దృశైవాశు సర్వం చతుర్ధా విభక్తమ్‌ |
వినోదార్థమేవం విధింమాం విధాయ దిసర్గే కిలేదం కరోషీతి కామమ్‌. 35
హరింపాలకః కింత్వయాసౌ మధోర్వా తథా కైటభాద్రక్షితః సింధుమధ్యే |
హరః సంహృతః కింత్వయాసౌ నకాలే కథంమే భ్రువో ర్మధ్యదేశా త్సజాతః. 36
కిలాద్యాసి శక్తి స్త్వమేకా భవాని! స్వతంత్రైః సమసై#్త రతో బోధితాసి. 37
త్వయా సంయుతోహం వికర్తుం యమర్థో హరిస్త్రాతుమంబ త్వయాసంయుతశ్చ |
హరః సంప్రహర్తుం త్వయైవేహయుక్తః క్షమా నాద్య సర్వే త్వయా విప్రయుక్తాః 38
యథాహం హరిః శంకరః కిం తథాన్యే నజాతా నసంతీహ నోహభవిష్యన్‌ |
నముహ్యంతి కేస్మిం స్తవాత్యంతచిత్తే వినోదే వివాదాస్పదేల్పాశయానామ్‌. 39
ఆదిదేవీ! నాలుగు వర్ణములుగల ప్రజలను బుట్టింపుమని నీవు నన్ను జ్యేష్ఠునిగ బ్రహ్మగ నేర్పరచితివి. కాని, నా కంటె నితరుడెవ్వడు గలడను నహంకారముతో కన్ను మిన్ను గానకున్నాను. నా యపరాధము క్షమించుము! అష్టవిధయోగమార్గములలో శ్రమించి సమాధినిష్ఠులైనవారు సైతము నీ నామ మహిమ నెఱుగలేరు. కాని నీ దివ్యనామము కపటముగ బల్కినను సరే, అది ముక్తికి సోపానమగును. సాంఖ్యులు నీ దివ్యనామము పరిత్యజించి మూఢులై వర్తిల్లుదురు. అట్టి వారిని భవవారిధి నుండి దాటించి యుమృతత్వ మొసగుతల్లివి నీవే. ఆద్యులగు హరి హరులను గొల్చినను నీ పరమతత్వ మెఱింగినవారు నీ నామ మహిమ నెఱుంగగలరు. వారు నిన్ను మహాశక్తీ శివా ఈశ్వరీ అంబికా యని నీ దివ్యనామమును నిమిషమైన వదలక జపించుచుందురు. విశ్వజననీ! నీ కటాక్ష వీక్షణము మాత్రనే నీ వీ నలు తెఱుంగుల నున్న జగములను నిర్మింపజాలుదువు. ఐనను నన్ను సృజించి నాచేత సృష్టి విదింపజేయుట చూడగ నిదంతయు నీ వినోదలీలగ భాసించుచున్నది. శ్రీహరి విశ్వపాలకుడు. అతడు జలధి మధ్యమున నుండగ మధుకైటభ దానవుల బారినుండి యాహరిని బ్రోచిన తల్లివి నీవే. ఆ శివుడును నీ చేత హరింపబడి మరల ప్రళయాంతమున నీ కనుబొమల నడుమనుండి యుద్భవించును. ఓ విశ్వమాత! నీ పావన జన్మమునకు మూలమేదో మేమింతవఱకు కనివిని యెఱుగము. ఓ భవాని! నీ వొక్కతెవే యాద్య శక్తివి. సర్వతంత్ర స్వతంత్రవని మేము నిన్ను సంబోధింతుము. నీ శక్తి తోడున్ననే హరి విశ్వరక్షణమును రుద్రుడు సంహారమును నేను సృష్టిని చేయగల్గుచున్నాము. నీ చైతన్య శక్తి తోడులేనిచో నెంతటివాడైన నేమియు జేయజాలడు. హరి శివుడు నేనువలెత్రిమూర్తులు మరెవ్వరేనిగలరా? పూర్వముండిరా? ఇదంతయు సత్తు, అసత్తను వితర్కమును మూఢమతులే యొనరింతురు.
అకర్తా గుణస్పష్ట ఏవాద్య దేవో నిరీహోనుపాధిః సదైవాకలశ్చ |
తథాపీశ్వర స్తే వితీర్ణంవినోదం సుసంపశ్యతీ త్యాహురేవం విధిజ్ఞాః. 40
దృష్ట్వాదృష్ట విభేదేస్మి న్ప్రాక్త్వత్తోవై పుమాన్పరః | నాన్యః కోపి తృతీయోస్తి ప్రమేయే సువిచారితే. 41
నమిథ్యా వేదవాక్యంవై కల్పనీయం కదాచన | విరోధోయం యయాత్యంతం హృదయేతు విశంకితః. 42
ఏకమేవాద్వితీయం యద్బ్రహ్మ వేదా వదంతివై | సాకింత్వం వాప్యసౌ వాకిం సందేహం వినివర్తయ. 43
నిఃసంశయం నమే చేతః ప్రభవ త్యవిశంకితమ్‌ | ద్విత్వైకత్వవిచారేస్మి న్నిమగ్నం క్షుల్లకం మనః. 44
స్వముఖేనాపి సందేహం ఛేతు మర్హసి మామకమ్‌ | పుణ్యయోగాచ్చమే ప్రాప్తా సంగతి స్తవ పాదయోః. 45
పుమానసి త్వంస్త్రీ వాసివద విస్తరతో మమ | జ్ఞాత్వాహం పరమాం శక్తిం ముక్తః స్యాం భవసాగరాత్‌. 46

నీ యీ విచిత్రలీలా వినోదముల నాద్యదేవుడు నిర్గుణుడు నిర్వికల్పుడు నిరుపాధికుడు విశ్వేశ్వరుడునగు విశ్వుడే యవలోకింపగలడని విధిజ్ఞులు పలుకుచుందురు. చరాచర భేదములుగల యీ రేడు లోకములందు నీ కంటె నన్యుడెవ్వడును లేడు. వేదవాక్కెప్పుడును రిత్తగ బలుకదు. అదియ ద్వైతమునే వక్కాణించును. కాని నేడు నా యెదలో ద్వైతము భాసించుచున్నది. ద్వైతము వేద విరుద్ధము. దీనిని గూర్చి నాకు సంశయము గల్గుచున్నది. ఒకటియే. రెండవ వస్తువు లేదు అని వేదము లుద్ఘోషించును. నీవట్టి బ్రహ్మవా? లేక ఆదిశక్తివా? నా యీ సందియ ముడుపుము. నాది క్షుద్రబుద్ధి. నీ వాస్తవికత నెఱుంగ లేక నా మది కొట్టుమిట్టాడుచున్నది. నా యీ తీరని సంశయము సంప్రాప్తించినది. తల్లీ! నీవు నిజముగ పురుషుడవా? యువతివా?! నా కింతకు నిజము పలుకుము. పరాశక్తివగు నీ దయకు పాత్రుడనై నేనీ మహా మాయాసాగరమునుండి విముక్తుడనగుదును.

శ్రీదేవీభాగవతమందలి తృతీయస్కంధమందు పంచమాధ్యాయము నుండి.

No comments:

Post a Comment