Monday, April 13, 2020

దేవతలు చేసిన శ్రీ జగదంబ స్తుతి

దేవతలు చేసిన  శ్రీ జగదంబ స్తుతి


ఊర్ణనాభాద్యథా తంతు ర్విస్ఫులింగా విభావసోః | తథా జగద్యదేతస్యా నిర్గతం తాం నతా వయమ్‌. 10
యన్మాయాశక్తి సంక్లప్తం జగత్సర్వం చరాచరమ్‌ | తాం చితం భూవనాధీశా స్మరామః కరుణార్ణవామ్‌. 11
యదజ్ఞానా ద్భవోత్పత్తి ర్యద్జానాద్భవనాశనం | సంవిద్రూపాం చ తాం దేవీం స్మరామః సాప్రచోదయాత్‌. 12

సాలెపురుగు నుండి దారములు వెల్వడునట్లే అగ్నినుండి మిణుగురులు బయలు వెడలునట్లే యెవరి నుండి యీ సకల జగములు పుట్టుచున్నవో యా విశ్వమాతకు మా మనస్సులు. ఏ మహా మాయాశక్తిచే నీ చరాచర జగమంతయును రచింపబడెనో యట్టి యచింత్య లక్షణములుగల చిత్కారణా స్వరూపిణిని మేము స్మరింతుము. ఏ మాయాతత్త్వ మెఱుగినచో సంసారము ఉత్పన్నమై తోచునో యే దివ్య తత్త్వ మెఱిగినచో సంసారము నశించునో యట్టి చిద్రూపను స్మరింతుము. ఆ వరేణ్యమైన చైతన్య జ్యోతి మా బుద్ధులను తచ్చింతనకు ప్రేరించుగాక!
మహాలక్ష్మై చ విద్మహే సర్వశక్త్యై చ ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్‌.
మాతర్నతాః స్మ భువనార్తి హరే! ప్రసీద శం నో విధేహి కురు కార్యమిదం దయార్ద్రే| 13
భారం హరస్వ వినిహత్య సురారివర్తం మహ్య మహేశ్వరి ! సతాం కురు శం భవాని!
యద్యంబుజాక్షి దయసే న సురాన్కదాచి త్కిం తే క్షమా రణముఖేస్తి శరైః ప్రహర్తుమ్‌! 14
ఏతత్త్వయైవ గదితం నను యక్షరూపం ధృత్వా తృణం దహ హుతాశ పదాభిలాపైః.
కంసః కుజోథ యవనేంద్రసుతశ్చ కేశీ బార్హద్రథో బకబకీ ఖరశాలాకల ముఖ్యాః| 15
యేన్యే తథా నృపతయో భువి సంతి తాంస్త్వం హత్వా హరస్వజగతో భర మాశు మాతః.
మే విష్ణునా న నిహతాః కిల శంకరేణ యే వా విగృహ్య జలజాక్షి! పురందరేణ| 16
తే తే సుఖం సుఖకరం సుసమీక్షమాణా స్సంఖ్యే శరైర్వినిహతా నిజలీలాయాతే,
శక్తిం వినా హరిహరప్రముఖాః సురాశ్చ నైవేశ్వరా విచలితుం తవ దేవదేవి | 17
కిం ధారణావిరహితః ప్రభురప్యనంతో ధర్తుం ధరాం చ రజనీశకలావతం సే.
ఇంద్రః. వాచా వినా విధిరలం భవతీహ విశ్వం కుర్తుం హరిః కిము రమరహితోథ పాతుమ్‌ | 18
సంహర్తుమీశ ఉమయోజిత ఈశ్వరః కిం తే తాభిరేవ సహితాః ప్రభవః ప్రజేశాః.
విష్ణుః: కర్తు ప్రభుర్న ద్రుహిణో న కదాచనాహం నాపీశ్వరస్తవ కళారహిత స్త్రిలోకాః! 19
కుర్తుం ప్రభుత్వమనఘెత్ర తథావిహర్తుం త్వం వై సమస్త విభవేశ్వరి భాసి నూనమ్‌. 20
ఏవం స్తుతా తదా దేవీ తానాహ విభుదేశ్వరాన్‌ | కిం తత్కార్యం వదంత్వద్య కరోమి విగతజ్వరాః! 21
అసాధ్య మపి లోకేస్మిం స్తత్కరోమి సురేప్సితమ్‌ | శంసంతు భవతా దుఃఖం ధరాయాశ్చ సురోత్తమాః. 22
దేవా ఊచుః: వసుధేయం భరాక్రాంతా సంప్రాప్తా విభుధాన్ప్రతి | రుదతీ వేపమానా చ పీడితా దుష్టభూభుజై. 23
ఓ జగదేక జననీ! భువనార్తిహారిణీ! మహేశ్వరీ! వివిధ శక్తులతో భాసిల్లు చిద్రూపిణీ! భవానీ! నీకు మా నమస్కారములు. మా యెడల సుప్రసన్నవై మాకు శ్రేయములు గల్గించుచు మా కార్యములు నెరవేర్చుము. రాక్షస వర్గమును నశింపజేసి భూభార ముడిపి శిష్యులకు శ్రేయము కలిగింపుము. ఓ రాజీవలోచనా! నీవు దేవతలపై దయజూపనిచో సమరాంగణమున నస్త్ర శస్త్రములతో శత్రువుల నెదుర్కొనజాలు వాడెవడుండెను? తొల్లి నీవు యక్షరూపము దాల్చి యగ్నితో ఈ గడ్డిపోచ గాల్చుము చూతుము' అని పలికినట్లు చెప్పితిని. ఈ విశాల ధరణిపై కంసుడు - భౌముడు - కాలయవనకేశులు - బక జరాసంధులు - ఖరశాల్వపూతనాదులు - నితర క్రూరరాజులను గలరు. వారి నెల్లర నంతమొందించి ధరాభారము తొలగింపగదే తల్లీ! కమలాక్షీ! ఇంద్ర శివ విష్ణువుల వలన రాక్షసులు కొందఱు చావకుండిరి. వారు మున్ను నీ సుఖకరమైన రూపము చూచుచుండగనే నీ బాణములతో నవలీలలగ మడిసిరి. ఓ చంద్రకళావతంసా! నీ చైతన్యశక్తి తోడులేనిచో బ్రహ్మ విష్ణు దేవులు నడుగు దీసి యడుగిడ నేరరు. అనంతుడును ధారణాశక్తి లేనిచో భూమిని మోయజాలడు. ఇంద్రుడిట్లనెను. వాగ్రూప క్రియాశక్తి యగు సరస్వతి తోడులేనిచో బ్రహ్మయును పద్మ లేనిచో పద్మనాభుడును గిరిజ లేక గిరీశుడును విశ్వమును పుట్టించి పెంచి తుదముట్టింప నోపరు. త్రిశక్తులతో గూడినంతనే త్రిమూర్తులగు ప్రజాపతులును తమ తమ కార్యములందు నిపుణులగుదురు. విష్ణు విట్లు నుడివెను : ఓ విమలజ్ఞానరూపా! నీ కళాశక్తి లేనిచో బ్రహ్మ విశ్వరచనము - నేను విశ్వపాలనము - శర్వుడు విశ్వసంహారము చేయ దక్షులముగాము. నీవొక్కతెవే యీ సమస్తమున కేలికవై విహరింపగలవు. నీవు సకల విభవముల కధీశ్వరివని నిక్కముగ మాకు దోచుచున్నావు.

శ్రీమద్దేవీ భాగవతమందలి చతుర్థ స్కంధమందు శ్రీ జగదంబను దేవతలు సంస్తుతించుటయను పందొమ్మిదవ యధ్యాయము నుండి.

No comments:

Post a Comment