Sunday, April 12, 2020

ప్రహ్లాదుడు చేసిన శ్రీదేవి మహిమ

ప్రహ్లాదుడు చేసిన  శ్రీదేవి మహిమ


ప్రహ్లాదః: స్తౌమి దేవీం మహామాయాం సృష్టిస్థిత్యంతకారిణీం | సర్వేషాం జననీం శక్తిం భక్తానామభయం కరీమ్‌. 32
వ్యాసః: ఇత్యుక్త్వా విష్ణుభక్త స్తు ప్రహ్లాదః పరమార్థవిత్‌ | తుష్టావ జగతాంధాత్రీం కృతాంజలి పుట స్తదా. 33
మాలాసర్పవ దాభాతి యస్యాం సర్వం చరాచరమ్‌ | సర్వాధిష్ఠానరూపాయై తసై#్య హ్రీ మూర్తయే నమః. 34
త్వత్తః సర్వ మిదం విశ్వం స్థావరం జంగమం తథా | అన్యే నిమిత్తమాత్రా స్తే కర్తార స్తవ నిర్మితాః. 35
నమో దేవి! మహామాయేః సర్వేషాం జననీ స్మృతా | కోభేద స్తవ దేవేషు దైత్యేషు స్వకృతేష చ. 36


ప్రహ్లాదు డిట్లనియెను: నేను సృష్టి స్థిత్యంతకారిణి-సర్వజనని-భక్తుల కభయప్రదాయిని - మహామాయాశక్తియగు మహాదేవిని సంస్తుతించుచున్నాను' అని నుతించి పరమార్థవిదుడు విష్ణుభక్తుడునైన ప్రవ్లూదుడు జగదంబకు నమస్కరించెను. పూలమాలయందు సర్పభ్రాంతి గలుగు నట్లే యే తల్లియందు చరాచరజగ మాభాసించునో యా సర్వాధిష్ఠానరూపిణి యగు హ్రీంబీజ స్వరూపిణిని నమస్కరించుచున్నాను. తల్లీ! ఈ స్థావర జంగమాత్మకమైన విశ్వమంతయును నీవలననే కలిగినది. బ్రహ్మాదులును నీచేతనే సృజింపబడి నిమిత్తమాత్రులై యున్నారు. ఓ మహామాయాదేవీ! నీకు నా నమోవాకములు. నీవు బ్రహ్మాండమాతవు. దేవదానవులను నీవే సృజించితివి. కాన నీకు వీరిపట్ల భేద మెక్కడిది?


మాతుః పుత్త్రేషు కోభేదోప్యశుభేషు శుభేషు చ | తథ్తెవ దేవే ష్వస్మాసు న కర్తవ్య స్త్వయాధునా. 37
యాదృశా స్తాదృశా మాతః సుతాస్తే దానవాః కిల | యత స్త్వం విశ్వజననీ పురాణేషు ప్రకీర్తితా. 38
తేపి స్వార్థపరా నూనం తథైవ వయ మప్యుత | నాంతరం దైత్య సురయో ర్భేదోయం మోహసంభవః. 39
ధనదారాదిభోగేషు వయం సక్తా దివానిశమ్‌ | తథైవ దేవా దేవేశి! కో భేదోసురదేవయోః. 40
తేపి కశ్యపదాయాదా వయం తత్సంభవాః కిల | కుతో విరోధ సంభూతి ర్జాతా మాత స్తవాధునా. 41
న తథా విహితం మాత స్త్వయి సర్వం సముద్భవే | సామతైవ త్వయా స్థాప్యా దేవేష్వస్మాసు చైవ హి. 42
గుణవ్యతికరాత్సర్వే సముత్పన్నాః సురా సురాః | గుణాన్వితా భవేయుస్తే కామం దేహభృతోమరాః. 43
కామః క్రోధశ్చ లోభశ్చ సర్వదేహేషు సంస్థితాః | వర్తంతే సర్వదా తస్మాత్కోవిరోధీ భవేజ్జనః. 44
త్వయా మిథో విరోధోయం కల్పితః కిల కౌతుకాత్‌ | మన్యామహే విభేదేన సూనం యుద్ధదిదృక్షయా. 45
అన్యథా ఖలు భ్రాతౄనాం విరోధః కీదృశోనఘే | త్వం చే న్నేచ్ఛసి చాముండే వీక్షితుం కలహం కిల. 46
జానామి ధర్మం ధర్మజ్ఞే! వేద్మి చాహం శతక్రతుమ్‌ | తథాపి కలహోస్మాకం భోగార్థం దేవి! సర్వథా. 47
ఏకఃకోపి నశాస్తాస్తి సంసారే త్వాం వినాంబికే | స్పృహావతస్తు కః కర్తుం క్షమతే వచనం బుధః. 48
తల్లికి బుట్టిన పుత్రులలో సన్మార్గులు దుర్మార్గులు నుందురు. ఐనను తల్లి వారిని సమానముగా గాంచును. అటులనే యిపుడు దేవతలయందును మాయందును నీకు భేదభావము తగదు. మాతా! నీవు పురాణములందు విశ్వజననివిగ పేరొందితివి. నీకు దేవత లెట్లో మేము నట్లు సుతులము. జననీ! వారును స్వార్థపరులే. మేమును స్వార్థపరులమే. నిజముగ దేవదానవుల మధ్య భేద మన్నది లేదు. ఉన్నచో నది భ్రాంతి మాత్రమే. ఓ యమ్మా! దేవేశ్వరీ! మేము ధనభార్యాది భోగము లందు నిత్యము సంసక్తులమైన మాట నిజమే. వారును మావంటివారే కదా? ఇంక మా యిరువురి నడుమ భేద మెక్కడిది? మాతా! వారును కశ్యపాత్మజులు. మేమును కశ్యపాత్మజులమే. ఇంక మా యిర్వురియందు నీకు భేదభావ మేల కలిగెను? విశ్వజననీ! నీయం దిట్టి విరుద్ధభావము తగదు. నీవు మమ్ములను దేవతలను సమభావమున జూడుమమ్మా! సురాసురులెల్లరును గుణకర్మ సంయోగమున సంభవించిరి. ఇంక దేహధారులైన దేవతలు మాకంటె నధికతరముగ గుణవంతు లెట్టులగుదురు? అన్ని శరీరము లందును కామక్రోధలోభమోహము లుండును. ఇంక విరోధభావము లేనివాడెవ డుండును? తల్లీ! నీకు నీ బుద్ధియందు మా యుద్ధము గను వేడుక పుట్టి యుండును. అందుచే నీవు లీలామాత్రముగ మాలో విభేదములు పుట్టించి పరస్పర విరోధములు గల్పించితివని తలంతుము. చాముండా! ఓ యనఘురాలా! నీకు నిక్కముగ మా కలహము గాంచు కోరికయే లేనిచో నన్నదమ్ములమైన మాలో మా కీ పొరపొచ్చెము లేల కలుగును? మేమును కొంచెము ధర్మ మెఱుగుదుము. ఇంద్రునిగూర్చి మాకంతయును తెలియును. ఇక మాలో మాకు గల కలహము కేవలము నీ భోగముకొఱకే సుమా! ఈ విశ్వబ్రహ్మాండ మందెల్ల నీవు గాకింకొకరు డెవడు శాసకుడు గలడు? కామములు గలవాని కోర్కు లన్నిటి నెంతటి పండితుడైన నెరవేర్చజాలడు.





శ్రీదేవీ భాగవత మందలి చతుర్థ స్కంధమందు ప్రహ్లాదుడు శ్రీదేవి మహిమను కొనియాడుటయను పంచదశాధ్యాయము నుండి.

No comments:

Post a Comment