Friday, April 10, 2020

శ్రీ ఈశ్వర కృత శ్రీ దేవి స్తోత్రం

శ్రీ ఈశ్వర కృత శ్రీ దేవి స్తోత్రం




శివ ఉవాచ : యది హరిస్తవదేవి విభావజ స్తదను పద్మజఏవ తవోద్భవః |
కిమహమత్ర తవాపి నసద్గుణః సకలలోకవిధ! చతురాశివే. 2
త్వమసి భూః సలిలం పవనస్తథా ఖమపి వహ్నిగుణశ్చ తథా పునః |
జనని తాని పునః కరణాని చ త్వమసి బుద్ధిమనోప్యథాహంకృతిః.
నచవిదంతి వదంతిచ యేన్యథా హరిహరాజకృతం నిఖిలంజగత్‌ | 3
తవకృతా స్త్రయఏవ సదైవతే విరచయంతి జగత్సచరాచరమ్‌. 4
అవనివాయుఖవహ్నిజలాదిభిః సవిషయైఃసగుణౖశ్చ జగద్భవెత్‌ |
యదితదా కథమద్య చ తత్స్ఫుటం ప్రభవతీతి తవాంబ కళామృతే. 5
భవసి సర్వమిదం సచరాచరం త్వమజవిష్ణుశివాకృతి కల్పితమ్‌ |
వివిధవేషవిలాసకుతూహలై ర్విరమసే రమసేంబ యథారుచి. 6
సకలలోకసిసృక్షు రహం హరిః కమలభూశ్చ భవామ యదాంబికే |
తవ పదాంబుజ పాంసుపరిగ్రహం సమధిగమ్య తదా నను చక్రిమ. 7
యది దయార్ద్రమనా నసదాంబికే కథమిదం బహుధా విహితం జగత్‌ |
సచివభూపతి భృత్యజనావృతం బహుధ నై రధనైశ్చ సమాకులమ్‌. 9
తమ గుణాస్త్రయ ఏవ సదాక్షమాః ప్రకటనావన సంహరణేషు వై |
హరిహరద్రుహిణాశ్చ క్రమాత్త్వయా విరచితా స్త్రిజగతాం కిల కారణమ్‌.10
పరిచితాని మయా హరిణా తథా కమలజేన విమానగతేన వై |
పథిగతైర్భువనాని కృతాని వా కథయ కేన భవాని ననానిచ. 11
సృజసి పాసి జగజ్జగదంబికే స్వకలయా కియదచ్ఛసి నాశితుమ్‌ |
రమయసే స్వపతిం పురుషం సదా తవగతిం నహి విద్మ వయం శివే. 12


శర్వుడగు శంకరు డా తల్లి మ్రోల చేతుల జోడించి యిట్లు నుతించెను: సకలలోకవిధాన నిపుణవగు ఓ శివా! బ్రహ్మయు విష్ణువును నీ సత్ప్రభావము వలననే జన్మించి సగుణరూపుడ నైతిని. విశ్వజననీ! నీవే భూమి నీరు అగ్ని వాయువు ఆకాశము జ్ఞానేంద్రియములు కర్మేంద్రియంబులు మనస్సు బుద్ధి చిత్తము అహంకారము అన్నియును నీవే. తల్లీ! తెలియనివారు బ్రహ్మవిష్ణుమహేశులే యీ జగములనెల్ల రచించిరందురు. కాని, యది సరిగాదు. నిజముగ నీ ముమ్మూర్తులను పుట్టించినది నీవే కదా తల్లీ! నీ దయామృతశక్తివలననే వారీ జగములను నిర్మింపజాలుదురు. ఈ చరాచర జగములెల్ల పంచతన్మాత్రలు త్రిగుణములు నింగి గాలి యగ్ని నీరు నేల అను పంచభూతములతో మాత్రమే సృజింపబడుచున్నవందుమా? అది సరిగాదు. మరేమన - వానిలో నీ చైతన్యజ్యోతి లేనిచో వానికి జీవన తత్త్వము గలుగ నేరదు. హరిహర బ్రహ్మలు నీ దయచేతనే యీ చరాచర జగములు నిర్మించిరి. అందు నీవు బహు నామరూపములలో నీ నచ్చిన వేషము దాల్చి భూతములతో స్వేచ్ఛగ రమింతువు. విరమింతువు. లోకైక జననీ! హరిహరబ్రహ్మ లీ లోకాలను సృష్ట చేయదలచి నీ పదపద్మము లందలి ప్రేమ మధు కణములు గ్రోలుదురు. పిదప వారీ సర్వమును చిత్రవిచిత్రగతుల నిర్మింపజాలుదురు. తల్లీ! నీవు నిత్యసత్యస్వరూపపు దయామృతలహరివి! మఱి హరిని సత్వగుణునిగ బ్రహ్మను రజోగుణయుతునిగ నన్ను తమోగుణిగ నిట్లు భిన్నరూపులనుగ నేల సృజించితివి? అమ్మా! నీ బుద్ధి విషమముగ నున్నదని తలతుము. కానిచో నీ జగములను రాజు మంత్రి సేవకులు ధని దరిద్రుడు నను వై విధ్యముతో నేల సృజింతువు! నీ సత్వరజస్తమోగుణములచే హరి విధి శివులు సృజింపబడిరి. వారు పాలన సృష్టి సంహారము లొనరింతురు. ఈ ముజ్జగములకు వారు కారణభూతులు. హరిహరబ్రహ్మలమగు మేము నీ దివ్యవిమానమున బయనించునపుడు మార్గమధ్యమున మే మనంతపుణ్యలోకములు గంటిమి. అవి నిత్యసవ్యములుగ నున్నవి. వాని నెవ్వరు నిర్మించిరో మాకు దయతో తెలియబలుకుము. నీవు నీ యమృతకళలతో నెల్ల భువనములను బుట్టించి పెంచి త్రుంపదలతువు. నీవాత్మ పతితో పూర్ణసంయోగ మంది నిత్యానంద మనుభవింతువు. మాకు మాత్రము నీ దివ్యమార్గము లెట్టివో బోధపడుట లేదు.
జనని దేహి పదాంబుజసేవనం యువతిభావగతా నపి నః సదా |
పురుషతా మధిగమ్య పదాంబుజా ద్విరహితాః క్వలభేమ సుఖం స్ఫుటమ్‌. 13
న రుచిరాస్తి మమాంబ పదాంబుజమ్‌ తవ విహాయ శివే భువనేష్వలమ్‌ |
నివసింతుం నరదేహ మవాప్యచ త్రిభువనస్య పతిత్వ మవాప్య వై. 14
సుదతి నాస్తి మనాగపి మేరతి ర్యువతిభావ మవాప్య తవాంతికే |
పురుషతా క్వసుఖాయ భవత్యలం తవపదం న యదీక్షణగోచరః. 15
త్రిభువనేషు భవత్వియ మంబికే మమ సదై వహి కీర్తి రనావిలా |
యువతిభావ మవాప్య పదాంబుజం పరిచితం తవ సంసృతినాశనమ్‌. 16
భువి విహాయ తావాంతిక సేవనం కివ వాంఛతి రాజ్యకంటకమ్‌ |
త్రుటి రసౌ కిల యాతి యుగాత్మతాం న నికటం యది తేంఘ్రిసరోరుహమ్‌. 17
తపసి యే నిరతా మునయోమలా స్తవ విహాయ పదాంబుజపూజనమ్‌ |
జనని తే విధినా కిల వంచితాః పరిభవో విభవే పరికల్పితః. 18
నతపసానదమేనసమాధినాచతథావిహితైఃక్రతుభిర్యథా |
తవపదాబ్జపరాగని షేవణాద్భవతిముక్తిరజేభవసాగరాత్‌. 19
మే మాడుదనమున నున్నవారము. మాకు నీ చరణ కమల ములందలి భక్తి ప్రసాదమిమ్ము. పురుషుడైనను నీ పదాంబుజంబులు నిక్కము భజింపని వాడు నిత్యసుఖములకు నోచుకొనడు. ఈ జగములందు నా మనస్సు నీ పదపద్మ సేవకు తప్ప మరెచ్చటికిని బోదు. నేను పురుషత్వమందినను త్రిభువనాధిపత్య మందినను నీ పదకమలములు పాసి యుండుటుకు నా మనసొప్పుటలేదు. నీ పాదపద్మముల సన్నిధినుండగ నా కెట్టి కొఱతయులేదు. నీ పదపద్మములు నా కన్నుల కెల్లవేళల గనబడుచున్న నదే పదివేలు-నేను పురుషత్వమును గోరుకొనను. యువతిగ నున్న నేను నీ చరణకమలము లాశ్రయించినచో నాకీ ముల్లోకములందు శాశ్వతయశము చేకురును! భవబంధములు తెగును! ఈ భూమిపై నీ పదసన్నిధి సౌభాగ్యమును గాలదన్ని నిష్కంటకమైన రాజ్యము గోరుకొను వాడెవ్వడు? ఒకవేళ నెవడేని నీ పదాంబుజములను తూలనాడినచో వాడు యుగములవఱకు జన్మ పరంపర లెత్తవలసిన వాడే యగును. ఏ మునులు నీ పదకమల మందలి భక్తి వదలి నిర్మలతప మొనరింతురో వారుగూడ విధివంచితు లగుదురు. ఏలన-వారు త్రిగుణమయులు. నీ సదమలభక్తిలేమిచే వారు ముక్తికి దూరులగుదురు. ముక్తిలక్ష్మి తపమునగాని దమమునగాని సమాధిచేగాని యాగాదులవలనగాని సాధ్యముగాదు. నీ పదజలములం దాత్యంతిక భక్తి యున్నప్పుడే మోక్షము కరతలామలక మగును.
కురుదయాం దయ సేయది దేవిమాం కథయ మంత్ర మనావిల మద్భుతమ్‌ |
సమభవం ప్రజవ న్సుఖితోహ్యయమ్‌ సువిశదం చ నవార్ణ మనుత్తమమ్‌. 20
ప్రథమజన్మని చాధిగతో మయా తదధునా నవిభాతి నవాక్షరః |
కథయ మాంమనుమద్య భవార్ణవా జ్జనని తారయ తారయతారకే. 21

ఓ సర్వ మంత్రాత్మికా! నా యెదలో నీ దయామృతరేణువు కొంత చిందింపదలచినచో నుత్తమము పావనము నగు నీ నవార్ణ మంత్ర రాజము నాకు ప్రసాదింపుము. నేను దానిని నిత్యము జపింతును. ఆత్మ చింతన సుఖమున నిత్యమోలలాడుదును. భవతారిణీ! జననీ! పూర్వజన్మమున నేను నవాక్షర మంత్ర మెఱింగితిని. కాని, యిపుడు నాకది స్ఫురించుట లేదు కనుక, నీభవార్ణవము దాటుటకు ఆ నవార్ణ మంత్ర ముపదేశింపుము.


శ్రీదేవీభాగవతమందలి తృతీయస్కంధమందు పంచమాధ్యాయము నుండి.

No comments:

Post a Comment