శ్రీ మానసదేవి చరిత
మానసదేవి కశ్యపమహర్షి యొక్క మానసపుత్రిక ! ఆమె తన మనస్సువలననే క్రీడించగల దగుటవలన మానసా దేవియన వన్నె కెక్కెను. ఆమె తన మనస్సుతోడనే పరమేశ్వరుని ధ్యానించును. పరమయోగములో మునుంగును. కనుక నామె మనసాదేవి యయ్యెను. ఆమె ఆత్మారామ వైష్ణవి సిద్ధయోగిని కృష్ణపరమాత్ముని గూర్చి మూడు యుగములు తపించెను. తపమువలన నామె శరీరము-వస్త్రము జీర్ణించుట చూచి కృష్ణ పరమాత్మ యామెకు జరత్కారువను పేరు పెట్టెను. గోపవిభు డామె కోర్కెను దయతో తీర్చి యామెను పూజించి యామెకు కీర్తి గల్గించెను. ఆమెను బ్రహ్మలోక-నాగలోక- స్వర్గలోక- భూలోక వాసు లెల్లరును పూజించిరి. ఆమె లావణ్యవతి సుమనోహర జగములకు గౌరి.
జగములకు పూజిత యగుటవలన నామెను జగద్గౌరి యందురు. శివుని శుష్యురా లగుటవలన నామెను శైవియందురు. ఆమె విష్ణుభక్తురాలగుట వైష్ణవి యన వాసికెక్కెను. ఆమె జనమేజయుని సర్పయాగమున నాగులను గాపాడినది కనుకనామె నాగేశ్వరి-నాగభగిని యన విలసిల్లెను. విషము హరించుటలో నేర్పరి గాన ఆమెను విషహరి యందురు. ఆమె శివునినుండి సిద్ధయోగముపొందుటవలన సిద్ధయోగినిగపేర్వడసెను. జ్ఞాన యోగములొసంగునట్టి మృతసంజీవనీ విద్య నెఱిగినది. అందువలన నామెను పండితులు మహాజ్ఞానయుత యందురు. ఆమె తపస్విని ఆస్తీక మునీంద్రుని తల్లి. అందుచే నామె జగములందు '' ఆస్తీకమాత'' యనగ ప్రతిష్ఠ గాంచినది. మహాత్ముడగు జరత్కారు మహాముని కామె ప్రియురాలు. విశ్వపూజ్యుడు పరమయోగి యైన జరత్కారుని ప్రియురాలు జరత్కారు-జగద్గౌరి-మనస-సిద్ధయోగిని వైష్ణవి-నాగభగిని- శైవి-నాగేశ్వరి- జరత్కారు ప్రియ- ఆస్తీకమాత- విషహార- మహాజ్ఞానయుత- విశ్వపూజిత దేవి అను పండ్రెండు పేర్లుపూజా సమయమున చదువవలయును. అట్లుచదివిన వానికి నాగభయము గల్గదు. అతని వంశము తామరతంపరగ వర్ధిల్లును. శయనించునపుడు గాని పాముచన్న యింటిగాని వీనిని చదివినచో సర్పభయము గలుగదు. పాములు నివసించుచోటను పాములుండు నడవు లందును పాములు చుట్లుకొనిన విగ్రహములందును వీనిని చదివినంతనే పాముల భయము గల్గదు. వీనిని నిత్యము చదువు వానిని చూచి పాములు వాని నుండి పారిపోవును.
ద్వాదశైత నామం:
జరత్కా రుర్జగ ద్గౌరీ మనసా సిద్ధ యోగినీ. 51
వైష్ణవీ నాగభగినీ శైవీ నాగేశ్వరీ తథా | జరత్కారు ప్రియా స్తీకమాతా విషహారేతి చ. 52
మహాజ్ఞాన యుతాచైవసా దేవీ విశ్వపూజితా | ద్వాదశైతాని నామాని పూజాకాలేతుయః పఠేత్. 53
ధ్యానము
శ్వేతచంపకవర్ణాభాం రత్నభూషణభూషితామ్ | వహ్నిశుద్ధాంశుకాధానాం వాగయజ్ఞోపవీతినీమ్. 2
మహాజ్ఞానయుతాం తాం చ ప్రవరజ్ఞానినాం వరామ్ | సిద్ధాధిష్ఠాతృ దేవీం చ సిద్ధాం సిద్ధిప్రదాంభజే. 3
శ్వేతచంపకమువంటి కాంతి గలది; రత్నభూషణభూషిత; అగ్ని శుద్ధ వస్త్రము ధరించినది; పాము జన్నిదము దాల్చినది. జ్ఞాన సంపన్నురాలు; మహాజ్ఞానులలో శ్రేష్ఠురాలు; సిద్ధాధిష్ఠానదేవి; సిద్ధ సిద్ధిప్రదయగు మనసను ధ్యానించుచున్నాను.
స్త్రోత్రము:
పురందర ఉవాచ : దేవి త్వాం స్తోతుమిచ్చామి సాధ్వీనాం ప్రవరాం వరామ్. 125
పరాత్పరాం చ పరమాం న హిస్తోతుం క్షమో2ధునా | స్తోత్రాణాం లక్షణంవేదే స్వభావాఖ్యాన తత్పరమ్. 126
న క్షమః ప్రకృతే వక్తుం గుణానాం గణనాం తవ | శుద్ధ సత్త్వ స్వరూపాత్వం కోపహిం సా వివర్జితా. 127
న చ శక్తో మునిస్తేన త్యక్తుం యాచ్ఞా కృతాయతః | త్వం మయా పూజితా సాధ్వీజననీ మే యథాదితిః 128
దయారూపా చ భగినీ క్షమారూపా యథా ప్రసూః | త్వయామే రక్షితాః ప్రాణాః పుత్రదారాః సురేశ్వరి. 129
అహంకరోమి తత్పూజాం ప్రీతిశ్చ వర్ధతాం సదా | నిత్యా యద్యపి పూజ్యాత్వం సర్వత్ర జగదంబికే. 130
తథాపి తవ పూజాం చ వర్ధయామి సురేశ్వరి | యే త్వా మాషాడ సంక్రాం త్యాం పూజయిష్యంతి భక్తితః 131
పంచమ్యాం మనసాఖ్యా యాంమాసాంతే నా దినే దినే | పుత్రపౌ త్రాయస్తేషాం వర్దంతే చ ధనానివై. 132
దేవీ! సతులతో శ్రేష్ఠురాలవగు నిన్ను స్తుతింపదలచుచున్నాను. పరాత్పరవు - పరమవు నగు నిన్నెవడు నుతింపగలడు! వేదములందు నీ స్తోత్రముల లక్షణము-స్వభావము-చరిత్రులు పెక్కుగలవు. దేవి! నీ ప్రకృతి సహజమైన గుణగణములు లెక్కించగలవాడులేడు. నీవు శుద్ధ సత్వస్వరూపిణివి క్రోధలోభహింసలు లేని తల్లివి - మునివరుడు నిన్ను వదలి వెళ్ళలేక నీ యనుమతితో వెళ్ళిపోయెను. సాధ్వీమతల్లీ! యదితి వంటిదానవు. నా తల్లివి. నిన్ను చక్కగ పూజించితిని. నీవు దయకు - క్షమకు ప్రతిరూపవు - నా భగినివి. సురేశ్వరీ! నీ వలననే నేను నా భార్య బిడ్డలు రక్షింపబడిరి. జగదంబా! నీవు నిత్య పూజ్యవు - సర్వపూజ్యవు. ఇకమీద నీ పూజలందు నాకు ప్రీతి పెంపొందు గాక! సురేశ్వరి! నీ పూజలను ప్రచారము చేతును. పరభక్తితో ఆషాడ సంక్రాంతినాడు కాని మనసా పంచమినాడు గాని మాసము చివరగాని నిన్ను పూజించువారు పుత్రపౌత్రులు ధనధాన్యములు గల్గి వర్ధిల్లుదురు.
యశస్వినః కీర్తమంతో విద్యావంతో గుణా న్వితాః | యేత్వాంన పూజయిష్యంతి నిందంత్య జ్ఞానతో జనాః 133
లక్ష్మీహీనా భవిష్యంతి తేషాంనాగభయం సదా | త్వం స్వయ సర్వలక్ష్మీ శ్చ వైకుంఠే కమలాలయా. 134
నారాయణాంశో భగవాన్ జరత్కారు ర్మునీశ్వరః | తపసా తేజసా త్వాం చ మనసా ససృజే పితా. 135
అస్మాకం రక్షణాయైవ తేన త్వం మనసాభిధా | మనసా దేవి శక్త్యా త్వం స్వాత్మనా సిద్ధయోగినీ. 136
తేన త్వం మనసా దేవీ పూజితా వందితా భవ | యే భక్త్యా మనసాం దేవాః పూజయం త్య నిశంభృశమ్. 137
తేన త్వాం మనసా దేవీం ప్రవదంతి మనీషిణః| సత్యస్వరూపాదేవీ త్వం శశ్వత్స త్య నిషేవణాత్. 138
యోహి త్వాం భావయేన్నిత్యం సత్యాం ప్రాప్నోతి తత్పరః
వారి పుత్రులు కీర్తి-విద్యా-గుణవంతు లగుదురు. అజ్ఞానముతో నిన్ను నిందించి పూజింపనివారు దరిద్రులగుదురు. వారికి నాగభయము గల్గును. ఓహో దేవీ! నీవు లక్ష్మీస్వరూపిణివి. వైకుంఠ పురమందలి లక్ష్మీదేవివి నీవే. నీ పతి జరత్కారుముని కేవలము నారాయణాంశజుడే నీ తండ్రి నిన్ను తన తపముచో తేజముచే తన మనస్సునుండి సృజించెను. నీ తండ్రి మారక్షణకే నిన్నట్లు సృజించెను. కాన నీవు మనసాదేవివైతివి. నీవు సిద్దమోగినివమ్మా! మనస్సు వలననే యెల్ల కార్యములు నిర్వర్తింపజాలిన దివ్య శక్తివమ్మా! అందువలన నీవు మనసాదేవి వైతివి- పూజితవు-వందితవునైతివి. దేవతలు నిశ్చలభక్తితో నిన్ను నిత్యము పూజింతురు. అందువలన నీవు మనసాదేవి వైతివి తల్లీ! నిత్యము సత్యమే పల్కుటవలన నిన్ను మనీషులు సత్వస్వరూపిణినిగ భావింతురు. ఏవాడు నిత్తెము నిన్నే స్వరించునో భావించునో యతడు తప్పక నిన్నేచేరును. అని యింద్రుడు మనసాదేవిని సన్నుతించి యామెనుండి వరము బడసెను.
శ్రీదేవీ భాగవత మహాపురాణమందలి తొమ్మిదవ స్కంధము నారద నారాయణ సంవాదము నలువదేడవ & నలువదెనిమిదవ యధ్యాయము నుండి.
------------------
-------------------
No comments:
Post a Comment